సినిమా న్యూస్

Kodi RamaKrishna Died:కోడి రామకృష్ణ గారు ఇక లేరు ..!

Kodi RamaKrishna Died:కోడి రామకృష్ణ గారు ఇక లేరు ..!

Kodi Ramakrishna Died Images

తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిన శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు. గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన రామకృష్ణను కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 69 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో రామకృష్ణ బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం కోడి రామకృష్ణ హార్ట్ అటాక్, పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంట‌నే కోలుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు తెరకెక్కించారు. 90ల‌లో ఎన్నో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన కోడి రామ‌కృష్ణ తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూనే మరోవైపు ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ వంటి ఫాంటసీ చిత్రాలను రామకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందించారు. 1982లో దర్శకుడిగా తన ప్రయాణాన్ని కోడి రామకృష్ణ ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తెరకెక్కించారు. అప్పటి నుంచి మొదలుకొని 2016 వరకు సినిమాలు చేస్తూనే వచ్చారు. చివ‌రిగా క‌న్నడ భాష‌లో ‘నాగరహవు’ (తెలుగులో నాగభరణం) అనే చిత్రాన్ని తీసారు.

నందమూరి బాలకృష్ణతో కోడి రామకృష్ణ అత్యధిక సినిమాలు తెరకెక్కించారు. వీటిలో చాలా సినిమాలు సూపర్ హిట్లు. ‘మంగమ్మగారి మనవడు’తో ప్రారంభమైన వీరిద్దరి కాంబినేషన్‌లో ఆ తరవాత ‘ముద్దుల క్రిష్ణయ్య, మువ్వ గోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మావయ్య, బాల గోపాలుడు, ముద్దుల మేనల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ తరవాత చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేష్, నాగార్జున, రాశేఖర్, వినోద్ కుమార్, భాను చందర్, అర్జున్, వడ్డే నవీన్, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబులతో కోడి రామకృష్ణ పనిచేశారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో సైతం ఈయన మంచి చిత్రాలు తెరకెక్కించారు.

 

Tags

Rajak

Hey! I am RajakVali the creator of TeluguTechWorld, a very popular YouTube channel in which I talk about tech in telugu. TeluguMala.com is my attempt to showcase the latest trends happening in the world to you in our own telugu language.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close